29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

మా ఓపిక నశిస్తే బయట తిరగలేరు.. బీజేపీకి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి పైన బీజేపీ శ్రేణులు చేసిన దాడులను టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదన్నారు. ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక.. ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు పాల్పడ్డట్టు కేటీఆర్ గుర్తుచేశారు.

రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి, భౌతిక దాడులకు బీజేపీ పదే పదే దిగడం తెలంగాణ రాజకీయాలకు ఏ మాత్రం వాంఛనీయం కాదన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టిఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందన్నారు. టిఆర్ఎస్ పార్టీ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం, బలగం మాకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు.

టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓపిక నశిస్తే..  బీజేపీ కనీసం బయట కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదన్నారు. మా ఓపిక కి ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే అనేక మార్లు బీజేపీని హెచ్చరించామని కేటీఆర్ చెప్పాడు. అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకు పోతున్నామన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మర్చిపోకూడదని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టేలా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, సమాజంలోని బుద్ధిజీవులు గమనించి, బీజేపీని ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Latest news

Related news