ఆస్తుల రిజిస్ట్రేషన్ లో వచ్చే సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరగాలని సూచించిన కేసీఆర్ ఆలోచన మేరకు పని చేస్తున్నామని చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా, వాటిని పరిష్కరించుకుంటూ.. సమస్యలు అధిగమిస్తామన్నారు.
మేధావులు, నిపుణుల సలహాలు తీసుకుంటామని తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నాలుగు రకాలుగా విభజించినట్టు వెల్లడించారు. రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్న కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమిస్తామన్నారు. బ్యాంకర్లతో రేపు సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమై పలు సందేహాలకు సమాధానమిస్తారని తెలిపారు. వారంలోపు రిజిస్ట్రేషన్ సమస్యలన్నీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని..అందుకు గానూ మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.