సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు చుస్తూ ఊరుకోరని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తిట్టడం మొదలుపెడితే బీజేపీ నేతలు గ్రామల్లో తిరుగలేరన్నారు. ఒకవైపు కేంద్రంలోని బీజేపీ మంత్రులు సీఎం కేసీఆర్ అమలు చెస్తున్న పథకాలను ప్రశంసిస్తుంటే.. బండి సంజయ్, అరవింద్ అవివేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనుగోలు కేంద్రాలు చూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ చూపించకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తమ పదవులకు రాజీనామాచేస్తారా అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే నీతి ఆయోగ్ కుడా తెలంగాణ సీఎంను ప్రశంసించింది. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చూపించగలరా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్వాగతిస్తాం. కానీ అనుచిత వాఖ్యలు చేస్తే తగినరీతిలొ బుద్ధి చెప్తామని హెచ్చరించారు.