పండించిన వడ్లను బియ్యం పట్టించాలంటే రైతు నానా తిప్పలు పడక తప్పదు. ట్రాక్టరో, ఎడ్లబండో కిరాయికి కట్టుకొని మిల్లు దగ్గరకు ధాన్యాన్ని తీసుకెళ్లడం.. మొదలు హమాలీ కూలీలు, బియ్యం, నూకలు, తవుడు వేర్వేరు సంచుల్లో ఎత్తడం ఒకట్రెండు రోజులు మిల్లు దగ్గర పడిగాపులు పడక తప్పదు. ఒక్కరోజులో బియ్యం ఇంటికి రావడం అనేది రైతుకు తీరని కలే. అయితే ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఇద్దరు స్నేహితులు కలిసి.. మొబైల్ రైస్‌మిల్లులను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యాన్ని మరపట్టి.. ఒక్కరోజులోనే రైతులకు బియ్యం అప్పజెప్పుతున్నాడు.
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అల్లూరుకు చెందిన ఇరకుల్ల రమేశ్ గతంలో రైస్‌మిల్లు నడిపేవాడు. రైస్ మిల్లు వల్ల రైతులు పడే ఇబ్బందులను దగ్గర నుంచి చూశాడు. ఈ క్రమంలో అత్యాధునికంగా తయారైన మొబైల్ రైస్‌మిల్లు గురించి తెలిసింది. వెంటనే రూ.6 లక్షలు పెట్టి మొబైల్ రైస్ మిల్ కొని తెచ్చాడు. ట్రయల్ రన్‌గా మొబై ల్ వాహనంతో ఊరూరా తిరిగాడు. కమాన్‌పూర్ మండలం జూలపల్లి పరిధిలోని ఆదర్శనగర్ పీఏసీఎస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రం ముందు ప్రదర్శనకు ఉంచాడు. అక్కడ వరి ధాన్యాన్ని మరపట్టి బియ్యంగా మార్చి రైతులకు అందించాడు. యంత్రం పని విధానం చూసి రైతులు ఆశ్చర్యపోయారు. తక్కువ సమయంలో బియ్యం చేతికి అందడం రైతులకు బాగా ఆకట్టుకుంది. దీనికి తోడు.. కల్లం వద్దకే వచ్చి మరపపట్టడం వల్ల రైతులకు చాలా శ్రమ తప్పింది. ఈ విషయం కాస్త చుట్టుపక్కల ఊర్లకు తెలిసి.. రమేష్ ను వడ్లు మర పట్టడానికి తమ కల్లాల వద్దకు పిలుస్తున్నారు.
రైతులు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లడం.. వారి కళ్లెదుటే ధాన్యాన్ని మర పట్టించడం అంతా గంటల్లోనే జరిగిపోతున్నది. క్వింటాల్ ధాన్యానికి రూ.300, తవుడు ఇస్తే రూ.150కే బియ్యం పడుతున్నాడు. కరెంటు అవసరం లేకుండా డీజిల్‌తో నడిచే ఈ మొబైల్ రైస్‌మిల్లుతో బియ్యం అచ్చం రైస్ మిల్లులో వచ్చినట్టుగానే నాణ్యతగా వస్తుండటంతో రైతులు మొబైల్ రైస్ మిల్లుకే ఆసక్తి చూపుతున్నారు. ఒక్క ఫోన్ చేయగానే నేరుగా పంట పొలాల వద్దకే మొబైల్ రైస్‌మిల్ వస్తుండటం వల్ల రైతులకు చాలా పని తప్పింది.
యూట్యూబ్‌లో చూసి..
మంచిర్యాల జిల్లా హాజీపూర్‌కు చెందిన పార్వతి లచ్చయ్య యూట్యూబ్‌లో బీహార్‌కు చెందిన చంద్రిక కంపెనీ రూపొందించిన మొబైల్ రైస్‌మిల్ వీడియో చూసి, దాన్ని కొనాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే బీహార్ వెళ్లి పది రోజులపాటు అక్కడి కంపెనీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్యాడీ క్లీనింగ్ నుంచి మిల్లింగ్ అయి.. బియ్యం రూపంలో బయటకు వచ్చే క్రమంలో ఎలా పని చేస్తుందో తెలుసుకున్నాడు. ఆపరేటింగ్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత మరో రెండు రోజులు కంపెనీ ఇంజినీర్ల సమక్షంలో బియ్యం పట్టడం ప్రారంభించాడు. పూర్తిగా పట్టు సాధించాక సొంతూరుకు వచ్చేశాడు.
‘మస్తు గిరాకీ ఉంది’
మేం వడ్లు పట్టిద్దామని మిల్లుకు పోతే గంటల కొద్దీ సమయం పట్టేది. ఒక్కోసారి రెండు మూడ్రోజులు అక్క డే ఉండాల్సి వచ్చేది. ట్రాక్టర్ల కిరాయి రూ.4 వేల దాకా ఖర్చయ్యేది. ఒకరోజు యూట్యూబ్ చూస్తుంటే మొబైల్ యంత్రం గురించి తెలిసింది. వెంటనే బీహార్‌కు వెళ్లి యంత్రం తెచ్చిన. ఇప్పుడు మస్తు మంది రైతులు ఫోన్ చేస్తున్నరు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోయి వడ్లు పడుతున్న. గిరాకీ మంచిగైతంది.
– పార్వతి లచ్చయ్య, హాజీపూర్, మంచిర్యాల జిల్లా
‘మిల్లుదాకా పోయే పని తప్పింది’
మొబైల్ రైస్‌మిల్లు వల్ల రైతులకు శాన పని తప్పింది. ఇదివరకైతే.. మిల్లుకు పోతే.. బియ్యం ఇంటికి రానీకె రెండు మూడు రోజులు పట్టేది. ఇప్పుడు అప్పటికప్పుడు బియ్యం అప్పజెప్పుతున్నరు. ఈ యంత్రం రైతులకు చాలా సౌకర్యవంతంగా ఉన్నది. బియ్యం కూడా మిల్లుల వచ్చినట్టే వస్తున్నయి. నేను 30 క్వింటాళ్ల వడ్లను పట్టించిన.
– సాన రామకృష్ణారెడ్డి, రైతు, జూలపల్లి, పెద్దపల్లి జిల్లా
రైతుల సౌలభ్యం కోసమే
పండించిన వడ్లను మర పట్టించాలంటే రైస్‌మిల్లుకు తీసుకెళ్లక తప్పదు. వడ్లను మిల్లకు చేర్చడం, పట్టించిన బియ్యాన్ని ఇంటికి తీసుకురావడం, దగ్గరి నుంచి గమనించిన. రైతుల కష్టాన్ని కొంతైనా తగ్గిద్దామని మొబైల్ రైస్‌మిల్ కొన్న. రైతులు ఒక్క ఫోన్ చేస్తే చాలు.. వాళ్ల కల్లం దగ్గరికే పోయి బియ్యం పడుతున్న. రైతులు చాలా సంతోషిస్తున్నారు.
– రమేశ్, మొబైల్ రైస్‌మిల్ నిర్వాహకుడు, అల్లూరు,