తమిళనాడులోని హొసూర్ నగరంలో ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడ్డ ముఠాను తెలంగాణ పోలీసులు సినిమా సీన్ రేంజ్ లో వేటాడి అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం ముత్తూట్ ఫైనాన్స్‌లోకి చొరబడ్డ 8 మంది దుండగులు.. అక్కడి స్టాఫ్ ను గన్స్ తో బెదిరించి, సిబ్బంది చేతులు కట్టేసి, 20 నిమిషాల వ్యవధిలో 25 కిలోల బంగారాన్ని దోచుకుని పారిపోయారు. ముందు బైక్ పై పరారయ్యి.. తర్వాత సుమోలో బోర్డర్ దాటేలా ప్లాన్ చేసుకున్నారు. వీరిని పట్టుకునేందుకు కృష్ణగిరి జిల్లా ఎస్పీ గంగాధర్ రంగంలోకి దిగారు. నిందితులు సుమోలో పరారైనట్లు తేలడంతో కర్ణాటక, ఏపీ, తెలంగాణ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దొంగలు వైట్‌ఫీల్డ్స్, చిక్‌బళ్లాపూర్ మీదుగా కర్ణాటక దాటి తెలంగాణలో ఎంటర్ అయ్యారు. ఇక అక్కడి నుంచి తెలంగాణ పోలీసులు అలెర్టయ్యారు. సీపీ సజ్జనార్ డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధుల్లో 100 మందిని రంగంలోకి దింపి, బెంగళూరు హైవే, టోల్ ప్లాజాల వద్ద నిఘా పెట్టారు. నిందితుల దగ్గర తుపాకులు ఉండడంతో.. పోలీసులు కూడా తాము వెంబడిస్తున్నట్టు నిందితులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు.

హైవే, టోల్ గేట్లన్నింటి చోట పక్కాగా నిఘా పెట్టి, ఎట్టకేలకు నిందితుల సుమోను గుర్తించారు. నిందితులు వెళ్తున్న సుమోను సింగిల్ రోడ్ లో.. పారిపోడానికి వీళ్లేని చోట పట్టుకోమని సజ్జనార్ ఆదేశించారు.. రాయ్ కల్ టోల్ గేట్ నుంచి పోలీసులు నిందుతులకు తెలికయకుండానే ఫాలో అవుతూ.. సరిగ్గా తెల్లవారుజామున 3.30కు పారిపోడానికి వీళ్లేని ప్లేస్ లో తొండుపల్లి టోల్గేట్ దగ్గర శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి బృందం నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరి దగ్గర గన్స్, దోచుకున్న బంగారం లేవు. సజ్జనార్ టీం.. తమదైన శైలిలో విచారించడంతో.. ఆయుధాలు, బంగారాన్ని కంటైనర్‌లో నాగ్‌పూర్ తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఆ కంటైనర్ మేడ్చల్ వైపు వెళ్తున్నట్లు తెలిసి బాలానగర్ జోన్ పోలీసులు, మాదాపూర్ ఎస్వోటీకి సమాచారం అందజేశారు. మేడ్చల్ చెక్‌పోస్టు దాటిన కంటైనర్‌ను పోలీసులు వెంబడించి, పట్టుకున్నారు. గ్యాంగ్ లో ఉన్న ఏడుగురిని, బంగారం, ఆయుధాలు అన్నీ స్వాధీనం చేసుకున్నారు. 15నిముషాల్లో దోపిడీ చేస్తే.. 15 గంటల్లో పోలీసులు పట్టేసుకున్నారు. మొత్తంమీద చేజింగ్ ఎపిసోడ్ అలా ముగిసింది.
