తెలంగాణ ఐటీ పాలసీ అద్భుతమైన ఫలితాలు అందించిందని, త్వరలోనే కొత్త ఐటీ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఐటీ పాలసీకి త్వరలో ఐదేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ఐటీ విభాగంలోని పలు సంస్థల అధిపతులతో మంత్రి కేటీఆర్ శనివారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మరిన్ని పెట్టుబడులు, మరిన్ని ఉపాధి అవకాశాలు లక్ష్యంగా త్వరలోనే కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తామన్నారు. పౌరుడి సౌకర్యం, సంక్షేమమే లక్ష్యంగా మరిన్ని ఆన్లైన్, మొబైల్ ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావాలన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో విజయం సాధించినట్లు గుర్తుచేశారు. త్వరలోనే టీ ఫైబర్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ మరింత బలోపేతం చేయాలన్నారు. విద్యార్థులను ఇన్నోవేటర్లుగా మార్చేలా.. స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేలా టస్క్ ను తీర్చిదిద్దాలని కేటీఆర్ సూచించారు. ఇందులో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఐటీ విభాగం నుంచి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.