అప్పుడెప్పుడో పెండ్లిపిల్ల ఇండియాల ఉండి.. పిలగాడు అమెరికాల ఉండి సెలవు దొర్కక వీడియో కాల్ లనే పెండ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాల బాగ తిరిగింది యాదికుందా? ఆ వీడియో సూశినోళ్లంతా.. గిదేం ఇచ్చంత్రమో అని ముక్కు మీద వేలేసుకున్నరు. అయితే.. ఎక్కిరిచ్చినోళ్ల మూతే వంకర పోతదన్నట్టు.. కరోనా బీమారి వల్ల వీడియో కాల్ పెండ్లీలు పెరిగిపోయినయ్.
ఒకప్పటి కాలం లెక్క ఇంటికి వచ్చి.. పెండ్లి పత్రిక చేతిల పెట్టి ‘ఫలానా నాడు లగ్గం మర్శిపోకుంట రార్రి‘ అని చెప్పే రోజులకు కాలం చెల్లింది. కరోనా రోగం పుణ్యమా అని ఫలానా నాడు లగ్గం.. మీరు రాకుంటె వాయె గానీ ఇగో ఈ లింకు మీద ఒత్తి ఆన్ లైన్ల మా పెండ్లి సూడుర్రి అని వాట్సప్ మెసేజ్ లు, డిజిటల్ గ్రీటింగులు పంపిస్తున్నరు. కరెక్టు టైమ్ కు వాళ్లు చెప్పిన యాప్ ల లాగిన్ అయి.. ఐడీ, పాస్ వర్డ్ కొడితె సాలు.. మనింట్ల మనం.. వాళ్ల పందిట్ల వాళ్లుంటరు. పెండ్లి తతంగం మాత్రం వీడియో కాల్ ల సూడాలె. అక్షింతలు ఎయ్య బుద్ధైతే ఫోన్ మీదనే ఎయ్యాలన్నట్టు. మరి పెండ్లి భోజనం ఉండదా అని పరేషాన్ గావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. లగ్గం అయిపోయే సమయానికి పెండ్లి భోజనం కూడా ఇంటికే పార్శిల్ పంపిస్తున్నరు. కాలు బయట పెట్టే పని లేదు. ఇంట్లనే కూసోని కొత్త బట్టలు వేస్కోని కెమెరా ముంగట కూసుంటె సాలు పెండ్లికి హాజరైనట్టే. కరోనా తెచ్చిన ఈ వింత ట్రెండే ఇప్పుడు శానమంది ఫాలో అయితున్నరు. రాను రాను ఇంకేం కొత్త ఇచ్చంత్రాలు పుట్టకొస్తయో!