టీఎస్ ఐ-పాస్ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతి మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఒకవేళ 15 రోజుల్లో అనుమతి ఇయ్యకుంటే ఇచ్చినట్టుగానే పరిగణించేలా చట్టం చేశామన్నారు. హైదరాబాద్ రెడ్‌హిల్స్ లోని ఎఫ్‌టీసీసీఐ భవన్లో వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. దీనికి చీఫ్ గెస్టుగా కేటీఆర్ హాజరై మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, బెస్ట్ లివింగ్ సిటీ విభాగాల్లో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని గుర్తుచేశారు.
తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవాళ్లు స్థానిక యువతకు అవకాశం కల్పించాలని సూచించారు. అలా ఇచ్చిన పరిశ్రమలక ప్రత్యేకంగా ఇన్సెంటీవ్లు ఇస్తామన్నారు. హైస్పీడ్ రైలు ప్రాజెక్టులను దక్షిణాది రాష్ర్టాల్లో కూడా ప్రవేశపెట్టాలన్నారు. ప్రపంచానికే వ్యాక్సిన్ క్యాపిటల్‌గా ఉన్న హైదరాబాద్‌కి కేంద్రం చేసిందేమి లేదన్నారు. రాబోయే బడ్జెట్లోనైనా తెలంగాణకు అధిక నిధులు కేటాయించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం పైసా ఇవ్వలేదన్న కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు. ఇందులో ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఎఫ్‌టీసీసీఐ ప్రతినిధులు పాల్గొన్నారు.