చూస్తే పులిలాగే ఉంటది. కానీ పులి కాదు. పులితోలును కప్పినట్టు ఉండే చేప. పేరు తెలంగాణేన్సిస్. ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వులో ఈ అరుదైన చేపను కనిపెట్టారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి అరుదైన చేప కనిపించలేదని శాస్త్రయులు అంటున్నారు.
ఉస్మానియా జంతుశాస్త్ర పరిశోధకులు కంటె కృష్ణప్రసాద్, చెలమల శ్రీనివాసులు, ఆదిత్య శ్రీనివాసులు పులిచారలున్న ఈ కొత్త రకం చేపను కనుగొన్నారు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ పరిశోధనలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ పరిశోధకుడు నీలేశ్, కేరళలోని యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్‌కు చెందిన అనూప్‌కుమార్ పాల్గొన్నారు. ఈ కొత్త రకం చేపను ‘జటాక్సా’ అనే అంతర్జాతీయ పరిశోధనా సంస్థ గుర్తించి, ఆ సమాచారాన్ని తన పత్రికలో ప్రచురించింది. శరీర లక్షణాలతోపాటు దాని మైటోకాండ్రియా, డీఎన్ఏ కూడా వేరుగా ఉండటంతో దీనిని కొత్తరకం చేపగా ప్రకటించారు. ఈ చేపను మొదటిసారిగా తెలంగాణలో కనుగొన్నందుకు రాష్ట్రం పేరుతోనే దాని శాస్త్రీయ నామం ఖరారు చేశారు. ఈ చేపలు కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కుంటలు, చెరువులలో మాత్రమే ఉన్నాయి.
ఆసిఫాబాద్ లో మరో అరుదైన చేప
గంగానదిలో మాత్రమే కనిపించే ‘స్ప్రాట్ కొరికా సోబోర్నా’ అనే మరో అరుదైన చేపను ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధకులు కుమ్రరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తలై గ్రామం సమీపంలో గుర్తించారు. కేవలం రెండు నుంచి మూడు అంగుళాల పొడవుండే ఈ జాతి చేపలు గంగా నది, దాని ఉపనదులలో లభిస్తాయి. ఉత్తరప్రదేశ్ నుంచి తూర్పు బంగ్లాదేశ్ ప్రాంతంలో వీటి ఉనికి ఉన్నది. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్‌లో కూడా ఈ జాతి చేపలున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో ఉస్మానియా యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగానికి చెందిన కంటె కృష్ణప్రసాద్, జీవవైవిధ్య సంరక్షణ కేంద్రానికి చెందిన మహమ్మద్ యూనస్ ఈ చేప వివరాలు సేకరించారు. ఈ అరుదైన చేప గురించిన ప్రత్యేక కథనం అంతర్జాతీయ పరిశోధన పత్రిక ‘జర్నల్ ఆఫ్ త్రేనెడ్ టాక్సా’ సంచికలో ప్రచురితమయ్యాయి. ‘బెంగాలీ కెచ్చి’గా పిలిచే ఈ చేప ఉనికి తెలంగాణ పరిధిలోని గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఉండటం ఆసక్తికరమని ఉస్మానియా యూనివర్సిటీ జంతుశాస్త్ర సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చెలమల శ్రీనివాసులు పేర్కొన్నారు. తెలంగాణలో ఎంతో జీవవైవిధ్యం ఉన్నదని ఈ క్రమంలో మరిన్ని శాస్త్రీయ సర్వేలు, అధ్యయనాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.