విద్యాశాఖలోని ఖాళీల పోస్టుల భర్తీకి కసరత్తు వేగవంతమయింది. సర్దుబాట్లు పోను.. ఖాళీల లెక్క తేల్చేందుకు ప్రక్రియ మొదలైంది. ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎక్కవ మంది ఎక్కడ పనిచేస్తున్నారు అనే వివరాలు తీయడంలో అధికారులు తలమునకలై ఉన్నారు. పాఠశాల విద్యాశాఖలో అన్నిరకాల పోస్టుల కలిపి దాదాపు 25 వేల ఖాళీలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలవారీగా పదోన్నతులు పోగా మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఖాళీలతోపాటు పదవీ విరమణలు, మరణాల వల్ల ఏర్పడిన ఖాళీలు కూడా భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీచర్ల రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందా? లేదా? అన్న అంశంపై అధ్యయనం చేసి.. త్వరలోనే అధికారులు క్లారిటీ ఇవ్వనున్నారు.
టీచర్ల నియామక ప్రక్రియ కంటే ముందే ఉన్నత పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడంపై రాష్ర్ట ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత ఎక్కువగా ఉన్న టీచర్లను సర్దుబాటు చేసి, విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్ పోస్టులను ఖాళీలుగా చూపతారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్ వంటి పలు జిల్లాల్లో ఎక్కువ టీచర్ పోస్టులు ఖాళీలున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి ఎస్జీటీ పోస్టులు, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ పోస్టులు అధిక సంఖ్యలో భర్తీ చేయనున్నారు. భాషాపండితులు, పీఈటీ పోస్టులతో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలోని మెథడాలజీలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీచేసే అవకాశాలు ఉన్నాయి. ఖాళీల వివరాలు సేకరించే కంటే ముందే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని విద్యాశాఖ భావిస్తోంది. దీనివల్ల రాష్ర్టంలో దాదాపు 20 వేలకుపైగా ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.