29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

టీన్యూస్ కు స్పందన.. అదిలక్ష్మికి అండగా ఉంటానన్నఎమ్మెల్సీ కవిత

తెలంగాణ తొలి మహిళా మెకానిక్ ఆదిలక్ష్మిపై టీన్యూస్ ప్రసారం చేసిన కథనానికి ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు మెకానిక్ షాపు పెట్టిన ఆదిలక్ష్మికి అండగా ఉంటానని కవిత భరోసా ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు కలిసారు. ఆదిలక్ష్మి మెకానిక్ షాపుకు అవసరమైన అత్యాధునిక మెషిన్లను అందిస్తానని కవిత హామీ ఇచ్చారు. అంతేకాకుండా  ఆదిలక్ష్మి ఇద్దరు ‌కూతుర్లను ఉన్నత చదువులు చదివిస్తానని భరోసా ఇచ్చారు. మహిళలు ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలరని.. ఆదిలక్ష్మి జీవితమే అందుకు నిదర్శనమని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. అడగకుండానే సాయం చేసి, ఇద్దరు బిడ్డలను చదివిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవితకు ఆదిలక్ష్మి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆదిలక్ష్మి నేపథ్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత అంజనానపురానికి చెందిన ఆదిలక్ష్మిది ఆర్థికంగా నిరుపేద కుటుంబం. మెకానిక్ గా పనిచేసే భర్త సంపాదనపైనే కుటుంబానికి ఆధారం. భర్త జీతం సరిపోక ఆర్థిక ఇబ్బందులకు తాళలేక కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకున్నది ఆదిలక్ష్మి. భర్తతో కలిసి ఏదైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంది. అక్కడా ఇక్కడా అప్పు చేసి భార్యాభర్తలిద్దరూ సుజాతనగర్‌లో టైర్‌ వర్క్స్‌ షెడ్డు తెరిచారు.  మెకానిక్ వర్క్ నేర్చుకుంటూ షెడ్డును తానే నడిపిస్తున్నది ఆదిలక్ష్మి. వాహనాలకు గ్రీజు పెట్టడం నుంచి వెల్డింగ్‌ పనులు, పంచర్‌ వేయటం వరకు అన్ని పనులూ చేస్తూ ఆదిలక్ష్మి శెభాష్‌ అనిపించుకుంటున్నది. ఇప్పుడు తనే సొంతంగా కొత్త షాపు పెట్టుకోవాలని నిర్ణయించుకొని, సాయం కోసం ఎదురు చూస్తోంది. టీన్యూస్ ఆదిలక్ష్మి కథనాన్ని ప్రసారం చేయడంతో ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఆదిలక్ష్మి గురించి తెలుసుకొని నేరుగా ఫోన్ లో మాట్లాడి అభినందనలు తెలియజేసింది.

- Advertisement -

Latest news

Related news