తెలంగాణలో ఐటీ పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్)ను ప్రారంభించి, ఐటీ పరిశ్రమ అభివృద్ధికి, ఉపాధి కల్పనకు తోడ్పాటు అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు గురువారం లేఖ రాశారు. కేంద్రానికి 2014 నుంచి ఐటీఐఆర్‌పై స్పష్టమైన విధానం లేదని, ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలుసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా అక్కడి నుంచి స్పందన రాలేదని లేఖలో ప్రస్తావించారు. తొలిదశను రూ.165 కోట్లతో 2018 నాటికి పూర్తి చేస్తామని, రెండో దశను 20 సంవత్సరాల్లో కొలిక్కి తెస్తామని చెప్పినా ఇప్పటికీ పని ప్రారంభం కాలేదని గుర్తు చేశారు. కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా నేటికి ఐటీఐఆర్ ప్రారంభం కాలేదన్నారు. ఐటీఐఆర్ కంటే మేలైనా స్కీంను తెస్తామని 2017లో ప్రకటించినా అది కూడా పత్తా లేకుండా పోయిందన్నారు.
ఐటీ జోరు.. తెలంగాణలో ఐటీ ఇండస్ట్రీ వృద్ధిని సాధిస్తోందన్నారు. 2014లో రూ.57,258 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు..2019- 20 నాటికి రూ.1,28,807 కోట్లకు చేరాయన్నారు. గత 6 ఏండ్లలో తెలంగాణలో ఐటీ ఇండస్ట్రీ 110 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. ప్రపంచ ప్రముఖ ఐటీ కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఫేస్బుక్, సేల్స్‌ఫోర్స్, సర్వీస్ నౌ వంటి సంస్థలు హైదరాబాద్ నుంచి తమ కార్యాకలాపాలు సాగిస్తున్నాయని గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా అనలిటిక్స్, ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ, యానిమేషన్, గేమింగ్, గ్రాఫిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీలో తెలంగాణ పురోగమిస్తోందన్నారు. ఐటీ డెవలప్ మెంట్ కోసం టీహబ్, టీవర్క్స్, వీహబ్, టాస్క్ వంటి ప్రత్యేక కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు.