ఆలోచనలు ఆవిష్కరణలుగా రూపుదిద్దుకొనే టీ హబ్-2 వేగంగా సిద్ధమవుతున్నది. ప్రపంచంపై ప్రభావం చూపగలిగే మహా ఆవిష్కరణలకు టీహబ్ -2 వేదిక కాబోతున్నది. టెక్నాలజీ ప్రియులకే కాదు.. సామాన్యులకు సైతం అవసరమైన వస్తువులు తయారయ్యే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ గా నిలవనుంది. మార్చికల్లా సిద్ధమై.. అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో రూ.276 కోట్లతో 3.12 ఎకరా ల్లో 3.72 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని నిర్మిస్తున్నారు. మరో రెండు లక్షల చదరపు అడుగులు పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సివిల్ వర్క్స్ దాదాపు పూర్తయ్యాయి. ఇంటీరియర్ పనులు కొన్ని మిగిలిపోయాయి. త్వరలోనే వాటిని కూడా పూర్తి చేసి.. అందుబాటులోకి తేనున్నారు.
2017 జనవరిలో టీహబ్-2కి శంకుస్థాపన చేశారు. తొలుత నిర్ణయించిన లక్ష్యం ప్రకారం ఇప్పటికే నిర్మాణం పూర్తి కావాలి. కరోనా వ్యాప్తి కారణంగా పనులు కొంత ఆలస్యమయ్యాయి. ఇది పూర్తయితే దేశంలోనే కాదు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్గా గుర్తింపు పొందనుంది. మొదటి స్థానంలో పారిస్ ఇంక్యుబేషన్ ఉంది. దీన్ని 3.70 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. టీ హబ్-2 సిద్ధమవుతున్న నేపథ్యంలో మొదటి భవనాన్ని ట్రిపుల్ ఐటీకి అప్పగించనున్నారు. అక్కడి స్టార్టప్‌లు ఇక్కడికి మార్చనున్నారు. ఇక్కడ 1000 పైగా స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తారు. భవిష్యత్‌లో ఈ సంఖ్యను రెండు వేలకు పెంచే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.