29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ప్ర‌గ‌తిశీల రాష్ట్రంగా తెలంగాణ.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

ఆరున్న‌రేళ్ల కృషి ఫ‌లితంగా రాష్ట్రం ప్ర‌గ‌తిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంద‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ అన్నారు. నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్‌లో 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు, ప‌లువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై జాతీయ జెండాను ఆవిష్క‌రించి పోలీసు గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రించారు.

అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెప్పారు. అనేక రంగాల్లో తెలంగాణ దేశంలో అగ్ర‌గామిగా నిల‌వ‌డం స్ఫూర్తిదాయ‌క‌మ‌న్నారు. ఉద్యమ నాయకుడికే పాలన బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్రం అభివృద్ధి ప‌థాన‌ పయనిస్తోందన్నారు.

క‌రోనా మహమ్మారిని రాష్ట్ర ప్ర‌భుత్వం దీటుగా ఎదుర్కొంద‌ని ప్రశసించారు. క‌రోనా స‌మ‌యంలో సొంత ఖ‌ర్చుల‌తో రాష్ట్ర ప్రభుత్వం వ‌ల‌స కూలీల‌ను తరలించినట్లు గుర్తుచేశారు.  హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భార‌త్ బ‌యోటెక్ తొలి దేశీయ టీకాను రూపొందించిందన్నారు.

ప‌ల్లె ప్ర‌గ‌తి ద్వారా గ్రామాల్లో మౌలిక స‌దుపాయాలు,  ప్ర‌తి గ్రామంలో వైకుంఠ‌ధామాలు ఏర్పాటు చేసినట్లు గవర్నర్ చెప్పారు. హ‌రిత‌హారంలో నాటిన మొక్క‌ల్లో 91 శాతం సంర‌క్షించామ‌ని, 12 వేల‌కు పైగా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తున్నామ‌ని గుర్తు చేశారు. ప‌ట్ట‌ణాల్లో మౌలిక సౌక‌ర్యాల కోసం ఏటా రూ. 148 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని గవర్నర్ చెప్పారు.

రాష్ర్టంలో 116 చోట్ల స‌మీకృత మార్కెట్ల నిర్మాణం  చేపట్టేందుకు వీలుగా 2021-22 బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 చోట్ల అర్బ‌న్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి చేపడుతున్నామన్నారు. అన్ని ప‌ట్ట‌ణాల్లో ప్ర‌తీ ఇంటికి నెల‌కు 20 వేల లీట‌ర్ల ఉచిత నీరు అందిస్తున్నామ‌ని చెప్పారు.

దేశానికి తెలంగాణ అన్న‌పూర్ణగా మారింద‌ని, దేశంలో 55 శాతం ధాన్యం తెలంగాణ నుంచే సేక‌రించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో వ‌రి విస్తీర్ణం కోటి 4 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పెరిగింద‌న్నారు. నిరంత‌ర విద్యుత్ ద్వారా 24 ల‌క్ష‌ల పంపుసెట్ల కింద పంట‌లు పండిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి ద్వారా 16 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరు అందుతుంద‌న్నారు.

మిష‌న్ కాక‌తీయ ద్వారా భూగ‌ర్భ జలాలు 4 మీట‌ర్ల మేర పెరిగాయ‌న్నారు. సాగునీటి ప్రాజెక్టులు కాళేశ్వ‌రం, పాల‌మూరు – రంగారెడ్డి, సీతారామ‌, దేవాదుల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత‌ నిశ్చయంతో ఉందన్నారు.

రెవెన్యూ సంస్క‌ర‌ణ‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని, ధ‌ర‌ణి పోర్ట‌ల్ నూరు శాతం విజ‌య‌వంతం అయింద‌న్నారు. రైతుబంధు ద్వారా ఇప్పటి వరకు రూ. 7,351 కోట్లు పంపిణీ చేశామ‌ని గుర్తుచేశారు.

రైతులు చ‌ర్చించుకునేందుకు వీలుగా రైతు వేదిక‌ల నిర్మాణం చేప‌ట్టామని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై చెప్పారు. విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం 16,245 మెగావాట్ల‌కు పెరిగిందని, అన్ని రంగాల‌కు 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

- Advertisement -

Latest news

Related news