24.6 C
Hyderabad
Monday, October 26, 2020

స్వరాష్ట్ర కల సాకారమైన రోజు…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు చిన్న పిల్ల నుంచి పండు ముసలి వరకు జాతి మొత్తం సంతోష పడిన రోజు. సబ్బండ వర్ణాలు సంబరపడిన రోజు జూన్‌ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన సంబంరం అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో, దేశంలో, విదేశాలలో ఉన్న తెలంగాణ బిడ్డలందరీలో నూతన ఉత్సాహాన్ని నింపిన రోజు. జూన్‌ 2వ తేదీ అంటే ఎన్నో ఉద్వేగ క్షణాలను గుర్తు చేస్తుంది. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పుడు ఇష్టంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. 58 ఏండ్లు పరాయి పాలనలో పడ్డ కష్టాలను ఒక్కొక్కటిగా దూరం చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుపుకుంటున్నాం. అమరవీరుల త్యాగఫలం, సీఎం కేసీఆర్‌ నిరాహార దీక్ష ఘట్టం ఆ దృశ్యాలు కండ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి. 

జయశంకర్‌ సారు కాలుకు బలపం కట్టుకుని ఊరురూ తిరుగుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని సజీవంగా ఉంచితే 2001 ఏప్రిల్‌ 21వ తేదీన కేసీఆర్‌ తన డిప్యూటీ స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఏప్రిల్‌ 27వ తేదీన టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించారు.  2001 మే 17వ తేదీన కరీంనగర్‌లో జరిగిన తెలంగాణ సింహగర్జన సభలో అహింసా మార్గంలోనే రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ సాధన నినాదం తీసుకున్నారు.  2001 సెప్టెంబర్‌లో వెలువడిన సిద్ధిపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్‌ భారీ మెజారిటీతో గెలుపొందారు. పార్టీ పుట్టిన పది నెలలు కాకమునుపే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని, సీఎం కేసీఆర్‌ను 22 శాతం ఓట్లతో తెలంగాణ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారు. తెలంగాణ అనే మాట అసెంబ్లీలో నిషేధం విధించిన పార్టీలే తెలంగాణ నినాదం ఎత్తుకునేలా పన్నిన కేసీఆర్‌ వ్యూహం ఫలించింది.

 రెండు జడ్పీలు టీఆర్‌ఎస్‌ పార్టీకి దక్కడంతో రాష్ర్టాన్ని పాలించిన పార్టీలకు, జాతీయ పార్టీలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను తలుచుకుని నిద్ర కరువైంది. దాని ఫలితమే 2004లో అప్పటి వరకు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంది.  తెలంగాణ అంశం జాతీయ ఎజెండాగా మారింది. 2004 అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలంగాణ అంశం కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌లో చేసింది. పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్రపతి నోట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాట పలికింది. అప్పటి నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న తెలంగాణ 2009 నవంబర్‌ 29వ తేదీన కేసీఆర్‌ దీక్షతో ఉద్యమంలోకి ఉవ్వేత్తున ఎగిసింది. డిసెంబర్‌ 9వ తేదీన రాత్రి 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటించారు.  సీమాంధ్రలో సమైక్య కృత్రిమ ఉద్యమంతో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనపై వెనక్కు వెళ్లింది. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక ఘట్టాలు

 • నవంబర్‌ 29, 2009: తెలంగాణ కోసం కేసీఆర్‌ ఆమరణ దీక్ష ప్రారంభం
 • డిసెంబర్‌ 1, 2009 : కేసీఆర్‌ అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బంద్‌
 • డిసెంబర్‌ 2, 2009: కేసీఆర్‌కు మద్దతుగా అన్ని జిల్లాల్లో రిలే దీక్షలు ప్రారంభం. 
 • డిసెంబర్‌ 09, 2009: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటన
 • డిసెంబర్‌ 23,2009: కేంద్ర హోంశాఖ తెలంగాణ అంశంలో డిసెంబర్‌ 9వ తేదీన చేసిన ప్రకటన సవరించుకుంటూ తెలంగాణ అంశంపై మరింత విస్తృత స్థాయిలో సంప్రదింపులు కొనసాగుతాయని చిదంబరం మరో ప్రకటన చేశారు. ఆరోగ్యం సహకరించకున్నా కేసీఆర్‌ హుటాహుటిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపి జేఏసీ ఏర్పాటు చేశారు. 
 • డిసెంబర్‌ 24, 2009: కలింగభవన్‌లో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలతో కలిసి జేఏసీ తొలి సమావేశం. 
 • జనవరి 5వ తేదీ 2010: సీమాంధ్రలో సమైక్య కృత్రిమ ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కేంద్ర హోంశాఖ ఢిల్లీలో సమావేశం. 
 • జనవరి 28, 2010 రాష్ట్ర పరిస్థితుల అధ్యయనానికి కమిటీ నియమిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి చదంబరం ప్రకటన.
 • ఫిబ్రవరి 2, 2010 కమిటీ సారథిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ణ,  మరో నలుగురు సభ్యులు, కమిటీ విధివిధానాలు ఖరారు. 
 • డిసెంబర్‌ 30,2010 జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తమ నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించింది. నివేదికలో ఆరు పరిష్కారాలను సూచించింది. 
 • జనవరి 6, 2011: శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు తెలియజేసేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రెండో సారి అఖిలపక్ష సమావేశం. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు దూరంగా ఉన్నాయి. 
 • మార్చ్‌ 10, 2011: మిలియన్‌ మార్చ్‌
 • సెప్టెంబర్‌ 13, 2011 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని సకల జనుల సమ్మె ప్రారంభం. ఇది 42 రోజుల పాటు కొనసాగింది. 
 • డిసెంబర్‌ 28, 2012: కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన 8 పార్టీలతో భేటీ
 • జులై 12,2013: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ ఖరారుకు ఏర్పాటు చేసిన కోర్‌ కమిటీ సమావేశానికి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరు. 
 • జులై 31, 2013: ఢిల్లీలో యూపీఏ మిత్రపక్షాల సమావేశం. హైదరాబాద్‌ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని నిర్ణయం. 
 • అక్టోబర్‌ 3, 2013: సీడబ్ల్యూసీ నిర్ణయానికనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. 
 • అక్టోబర్‌8, 2013 : రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రులతో జీఎంవో ఏర్పాటు.
 • 2013 నవంబర్‌ 12, 13వ తేదీల్లో రాష్ట్రంలోని ఎనిమిది పార్టీలతో జీఎంవో సమావేశం. అప్పటి వరకు తెలంగాణకు అనుకూలంగా ఉన్నామంటూ, లేఖ ఇచ్చామంటూ చెప్పిన టీడీపీ యూటర్న్‌. సమావేశానికి గైర్హాజరు. 
 • 2013 డిసెంబర్‌ 12వ తేదీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్రం రూపొందించిన బిల్లుపై రాష్ట్ర శాసనసభ అభిప్రాయం సేకరించేందుకు రాష్ట్రపతి బిల్లు ప్రతులు అసెంబ్లీకి పంపారు. 
 • జనవరి 30వ తేదీ 2014: అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ పూర్తి, బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన తీర్మానానికి శాసనసభ ఆమోదం. 
 • ఫిబ్రవరి 13, 2014: లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
 • ఫిబ్రవరి 18, 2014 : లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోదం. 
 • ఫిబ్రవరి 20, 2014: రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోదం. 
 • మార్చ్‌ 1వ తేదీ, 2014: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి, భారత రత్న  ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం తెలిపిన రోజు.
 • మార్చ్‌ 4వ తేదీ 2014: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ప్రభుత్వ రాజముద్ర( గెజిట్‌)లో ప్రచురించిన రోజు..
 • జూన్‌ 2వ తేదీ 2014: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం.
- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...