రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఉద్యోగాల భర్తీని పర్యవేక్షించడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి నోటిఫికేషన్లు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అన్నిశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల లెక్కలను వెంటనే తేల్చాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్, ఉపాధ్యాయ, ఇతర విభాగాల్లో 50 వేలకుపైగా నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం బీఆర్కే భవన్లో వివిధశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా అన్నిశాఖల్లో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను సమర్పించాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఖాళీల వివరాలను నిర్ణీత ఫార్మాట్లో వేగంగా సమర్పించాలని సూచించారు.
నియామకాల ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని.. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు సీఎస్ ప్రకటించారు. అవసరమైతే నిబంధనల్లో మార్పులు, సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు. వివిధశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేస్తామన్నారు.