29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

తెలంగాణ భాషోద్యమ వేదిక ‘గడిగోలు’

ఇరిసెలంటే తెలుసా..? గడిగోలు పదాన్ని ఎప్పుడైనా విన్నారా..? ఇవన్నీ మన అచ్చ తెలంగాణ పల్లె జనాల్లో వాడుకలో ఉన్నపదాలే.. కాకపోతే వాడకం తగ్గి అవి మరుగున పడిపోయాయి. ఇలా మరుగున పడిన తెలంగాణ పల్లె పదాలు, సామెతలను సేకరించి వాటిని ఫేస్ బుక్ వేదిక ‘గడిగోలు’ ద్వారా నేటి తరానికి అందిస్తూ అచ్చమైన తెలంగాణ పదాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు జగిత్యాల జిల్లాకు చెందిన తాంద్ర సుధీర్ కృషి చేస్తున్నాడు.

2017 న‌వంబ‌ర్ 12న ప్రారంభమైన ఈ పేజీలో తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలతోపాటు దుబయ్, అమెరికా సహా 38 దేశాల్లో స్థిరపడిన 14 వేల మంది తెలంగాణ ప్రజలు ఈ ఫేస్ బుక్ పేజీలో సభ్యులుగా ఉన్నారు. వీరిలో ఎంతో మంది కవులు, రచయితలు ఉన్నారు. వీరంతా యాదిమరిచిన పదాలు, కళలు, పల్లె సంప్రదాయాలు, వంటలను నేటితరానికి గుర్తు చేస్తున్నారు.

తెలంగాణ జిల్లాల్లో వాడుకలో ఉన్న తెలంగాణ పదాలు, కళలను సేకరిస్తూ.. వాటి పుట్టుక,  వాడకంపై అర్థవంతమైన వివరణలు జోడిస్తున్నారు. అంతరించిపోతున్న తెలంగాణ కళలను సైతం గడిగోలు వెలికితీస్తుంది. యచ్చగానం, భాగవతులు, చిందు ఆటలు, సాధన శూరుల విన్యాసాలు ఇలా ఎన్నో కళారూపాల గురించి సమగ్రమైన సమాచారాన్ని పొందుపరిచారు. వీటితోపాటు తెలంగాణలోని ప్రత్యేక జానపదాలను, పల్లె పాటలను సేకరించి ఫేస్ బుక్ పేజీలో పెడుతున్నారు. తెలంగాణకు మాత్రమే పరిమితమైన ప్రత్యేకమైన వస్తువులు, వంటలకు సంబంధించిన 1500 పైగా అరుదైన ఫోటోలను ఫేస్ బుక్ పేజీలో పెట్టారు.

దశాబ్దాల పాటు అవహేళనకు గురైన తెలంగాణ భాష, యాసను కాపాడే లక్ష్యంతో గడిగోలు సేకరించిన సమాచారాన్ని త్వరలోనే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో  తెలంగాణ పదకోశంగా తెచ్చేందుకు గ్రూపు సభ్యులు నిమగ్నమయ్యారు.

- Advertisement -

Latest news

Related news