23 C
Hyderabad
Wednesday, February 24, 2021

వీటిలో తెలంగాణ టాప్! కేంద్ర ఆర్థిక సర్వే రిపోర్ట్..

కరోనాను ఎదుర్కోవడంలో.. ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో.. పంటలు పండిచడంలో.. సర్వీస్ రంగంలో, చదువులో ఇలా అన్నింటిలో ముందుండి టాప్ పొజిషన్ లో నిలించింది తెలంగాణ.. నిన్న విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదికలో వెల్లడైన విషయాలివి.


ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనాకు కళ్లెం వేయడంలో.. అలాగే దానివల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి త్వరగా కోలుకోవడంలో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. మక్కలు, పత్తి ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే మూడోస్థానంలో ఉంది. స్కూల్ కు వెళ్తున్న 17 ఏండ్లలోపు వారి సంఖ్యలో తెలంగాణ టాప్‌-5లో నిలిచింది. అంతే కాకుండా పడిలేచిన కెరటంలాగా వీ ఆకారంలో ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నదని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే వెల్లడించింది. కరోనా దెబ్బకు దేశమంతటా ఆర్థిక రంగం కుదేలైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కానీ తెలంగాణ రాష్ట్రం కొద్ది కాలంలోనే కోలుకుని తిరిగి పూర్వస్థితికి వచ్చిందని ఆ నివేదికలో వెల్లడైంది.

లాక్‌డౌన్‌ వల్ల అన్ని వ్యవస్థలు నిలిచిపోవడంతో పన్నుల రాబడి పూర్తిగా పడిపోయి ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. మరలా అక్టోబర్‌ నుంచి వ్యాపారాలు పుంజుకొని రాష్ట్రాల్లో జీఎస్టీ పన్ను వసూళ్లు పెరిగాయి. కానీ అన్ని రాష్ర్టాలకన్నా ముందే తెలంగాణ సంక్షోభం నుంచి బయటపడింది. మూడు నెలల్లోనే సాధారణస్థాయికి చేరుకుంది. ఈ-వే బిల్లులను వర్తకులకు పంపిణీ చేయడంలో అధికార యంత్రాంగం ముందుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా తెలంగాణతోపాటు అగ్రస్థానంలో ఉందని సర్వే తెలిపింది. ఇక వీటితో పాటు దేశంలో సర్వీస్‌ రంగంలో అత్యధిక వాటా ఉన్న మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్డీపీ మొత్తంగా రూ. 9.7లక్షల కోట్లు ఉంటుందని.. అందులో 65.3 శాతం సంపద సేవారంగం నుంచి సమకూరుతుంది. అంటే ఐటీ, రియల్‌ ఎస్టేట్‌, వాణిజ్యం, పర్యాటకం, హోటళ్లు, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌, విద్య, వైద్యం వంటివి. ఆ తర్వాత వ్యవసాయం ద్వారా 13 నుంచి14 శాతం, మైనింగ్‌ ద్వారా 3.1 శాతం, భవన నిర్మాణాల ద్వారా 4.4శాతం, మాన్యుఫ్యాక్చర్‌ రంగంద్వారా 13శాతం సంపద సమకూరుతుంది. ఇలా అన్ని రంగాల్లో రాణిస్తూ.. ఆర్థికంగా ముందుకు దూసుకెళ్తోంది.


ఇకపోతే.. ఆర్థిక రంగంలోనే కాకుండా.. కోవిడ్‌ నియంత్రణలో కూడా తెలంగాణ టాప్ లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న ముందుజాగ్రత్త చర్యల వల్ల కేసులతోపాటు మరణాల రేటు భారీగా తగ్గిందని, వైరస్‌ను కట్టడి చేయడంలో దేశంలో కొన్ని రాష్ట్రాలే విజయం సాధించాయని ప్రశంసించింది. తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, బీహార్‌, రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నట్టు వెల్లడించింది. కరోనా మరణాలను తగ్గించడంలో కేరళ, తెలంగాణ ముందువరుసలో ఉన్నాయని తెలిపింది.

- Advertisement -

Latest news

Related news