
కడుపు నింపాల్సిన ఆహారమే ప్రాణాలు బలిగొన్న విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జొన్నరొట్టెలు తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కొద్ది రోజుల కిందట తృటిలో తప్పిన ప్రమాదం.. మళ్లీ వెంటాడింది. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం పల్వట్ల గ్రామానికి చెందిన జంగం చంద్రమౌళి కుటుంబం కులవృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పట్లాగే సోమవారం రాత్రి భోజనాల సమయంలో రొట్టెలు తిని నిద్రకు ఉపక్రమిస్తుండగా చంద్రమౌళి, సుశీల, అనసూయ, శ్రీశైలం, సరిత ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వీరిని వెంటనే జోగిపేటకు తరలించారు.
ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి చంద్రమౌళి, సుశీల, శ్రీశైలం పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. ఈ మధ్యకాలంలో చంద్రమౌళి తల్లి శంకరమ్మ కూడా జొన్నరొట్టెలు తిన్న కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. అయితే.. కులవృత్తిలో భాగంగా శంకరమ్మ పలువురి ఇండ్ల నుంచి పిండి, బియ్యం, ఇతర వస్తువులు అడిగి తెచ్చేది. ఈ క్రమంలోనే తెచ్చిన జొన్నపిండితో చేసిన రొట్టెలు తిని ఆమె ఆస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఆరోజు మిగతా కుటుంబ సభ్యులెవరూ తినకపోవడం వల్ల ప్రాణాపాయం చి బయటపడ్డారు. అయితే.. సోమవారం అదే పిండితో జొన్నరొట్టెలు చేసి.. కుటుంబమంతా తిన్నారు. రొట్టెలు తిన్న కొద్దిసేపటికే వారంతా అస్వస్థతకు గురయ్యారు. వారిలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరు కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. పదిహేను రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడడం గ్రామంలో విషాదంలో మునిగిపోయంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జొన్నపిండి ఎక్కడి నుంచి వచ్చింది..? ఎవరు ఇచ్చారు? జొన్నపిండిలో ఏవైనా విషపదార్థాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.