సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కలవడం ఇప్పుడు కొత్త కాదు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పలు సందర్భాల్లో ఆయన మోదీని కలుస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడం వంటి పలు అంశాలపై చర్చించారని గుర్తు చేశారు.
ఇటీవల జరిగిన పర్యటన కూడా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపైనే అని బాల్క సుమన్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక సంబంధాలుంటాయని.. వాటిలో భాగంగానే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆయన తెలిపారు. కనీసం ఈ విషయం కూడా సోయి లేకుండా ఎంపీ బండి సంజయ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో రకాల పదవులు అనుభవించిన వ్యక్తి కేసీఆర్ అని.. ఆయన గురించి మాట్లాడే ముందు బండి సజయ్ ఆచితూచి మాట్లాడాలని.. స్థాయి లేని వారంతా కేసీఆర్ గురించి మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్టు బండి సంజయ్ ఎగిరెగిరి పడుతూ.. అర్ధరహితంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కేసీఆర్ గురించి మాట్లాడే ముందు అవగాహన పెంచుకొని మాట్లాడాలని సూచించారు. లేని పక్షంలో తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. రాజ్యాంగ బద్ధ వ్యవస్థల మీద అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే సుమన్ బండి సంజయ్ కి హితవు పలికారు.