టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులు హాజరయ్యారు. అంతకుముందు సాధారణ కార్యకర్తలా సమావేశానికి వచ్చిన సీఎం.. రిజిస్టర్ లో సంతకం చేసి తర్వాత ఇటీవల మరణించిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.
పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, కమిటీల నియామకంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే టీఆర్ఎస్ వార్షికోత్సవం (ఏప్రిల్ 27) నాడు ప్లీనరీ నిర్వహించాలా? లేక బహిరంగ సభ ఏర్పాటు చేయాలా? అన్నదానిపై సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. అలాగే ఎమ్మెల్సీ, కార్పొరేషన్లు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి చివరికల్లా గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ వార్షికోత్సవం నాటికి రాష్ట్ర కమిటీ ఎన్నిక ప్రక్రియ పూర్తిచేయాలని గత శుక్రవారం పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే.
