రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వైస్ చాన్సలర్ ( వీసీ ) పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. బుధవారం టూరిజం ప్లాజాలో ఎక్సెల్ ఇండియా, ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హయ్యర్ ఎడ్యుకేషన్ – పోస్ట్ కొవిడ్ ఎరా’ సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వీసీల భర్తీ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుని కార్యాచరణను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు వివిధ యూనివర్సిటీల్లో 1,061 టీచింగ్ ఫ్యాకల్టీని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ న్యాయ పరమైన కారణాల వల్ల వాయిదా పడుతున్నాయని ఆయన తెలిపారు. చట్ట సవరణలు చేసి యూనివర్సిటీల టీచింగ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వినోద్ కుమార్ తెలిపారు. వివిధ పోస్టుల భర్తీకి చేపట్టే రిక్రూట్మెంట్ ప్రక్రియ ఏక కాలంలో జరిపితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల బీహార్ రాష్ట్రంలో చేపట్టిన రిక్రూట్మెంట్ విధానం బాగుందని తెలిపారు.