వాలెంటైన్ వీక్ లో నాలుగో రోజు టెడ్డీ డే. అమ్మాయిలకి టెడ్డి బేర్ అంటే ఎంత ఇష్టమే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాటిని చూడగానే అమ్మాయిల ముఖంలో ఆనందం కనిపిస్తుంది.
ప్రేమను రెట్టింపు చేసే ప్రతీ వస్తువుకి వాలెంట్స్ వీక్ లో స్థానం ఉంది. అందుకే టెడ్డీ కోసం కూడా ఒక రోజు ఉంది. చూడగానే హత్తుకోవాలి అనిపించే క్యూట్ డాల్ ను.. టెడ్డీ డే రోజున గిఫ్ట్ గా ఇస్తే ప్రియురాలి కళ్లల్లో ఆనందాన్ని చూడొచ్చు. ఇదంతా ఓకే కానీ.. అసలు ఈ టెడ్డీబేర్ అనేది ఎలా పుట్టిందో తెలుసా..
1902 నవంబరులో నాటి అమెరికా అధ్యక్షుడు ‘థియోడర్ రూజ్వెల్ట్’.. మిసిసిపీ, లూసియానాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి వెళ్లారు. అయితే అప్పుడు అక్కడి ప్రజలు ఆయనకు వేటాడి తెచ్చిన ఓ గాయపడిన పిల్ల ఎలుగుబంటిని ఆయనకు బహూకరించారు. చెట్టుకు కట్టేసి దానిని కాల్చాలని కోరారు. అయితే అ బుజ్జి ఎలుగుబంటి ప్రాణాలు తీయడానికి రూజ్వెల్ట్కు మనసొప్పక.. జాలితో దానిని విడిచిపెట్టేశారు. ఆ తర్వాత రూజ్ వెల్ట్ పెద్ద మనసుని పొగుడుతూ.. ‘క్లిఫార్డ్ బెర్రీమ్యాన్’ అనే కార్టూనిస్టు ఓ పత్రికలో చక్కని కార్టూన్ రూపొందించారు. తర్వాత ఆ కార్టూన్ ఆధారంగా బొమ్మల షాపు యజమానులు రోజ్, మోరిస్ మిచ్టమ్ ఎలుగుబంటి బొమ్మను తయారు చేసి అధ్యక్షుడి అనుమతితో దానికి ‘టెడ్డీబేర్’ అని నామకరణం చేశారు. ఈ విధంగా ‘నిన్ను నేను సంరక్షిస్తాను’ అనే భావనకు ప్రతిరూపంగా ‘టెడ్డీ బేర్’ అనే బొమ్మ ప్రపంచానికి పరిచయమైంది.