చలికాలంలో అప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న నొప్పులన్నీ నిద్రలేస్తాయి. కీళ్లు బిగుసుకుపోయి, కిర్రుమంటాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్లకి వింటర్ సీజన్ ఇంకా కష్టంగా ఉంటుంది. ఓ వైపు వణికించే చలి, మరోవైపు బిగుసుకుపోయిన కీళ్లు బాగా ఇబ్బంది పెడతాయి. మరి ఈ నొప్పుల నుంచి విరుగుడు ఎలా?

శరీరంలో ఏ చిన్న నొప్పి వచ్చినా చలి కాలంలో మాత్రం అది చాలా ఇబ్బంది. శరీరం చల్లగా ఉన్నప్పుడు రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దాంతో కీళ్లకు రక్తప్రసరణ తగ్గి, రక్తం ద్వారా కీళ్లకు అందాల్సిన పోషకాలు అందక.. బిగుసుకుంటాయి. దాంతో పాటు చలి వల్ల జాయింట్స్ చుట్టూ ఉన్న కండరాలలో సాగే గుణం తగ్గి బిగుతుగా మారి నొప్పికి కలిగిస్తుంది. అయితే సీజన్ మార్పులకు తగ్గట్టుగా లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేసుకుంటే.. కీళ్ల నొప్పుల నుంచి తప్పించుకోవచ్చు.
యాక్టివ్‌గా ఉంటూ..
చలికాలం అంటేనే బద్ధకం పెరిగిపోతుంది చాలామందికి. చలికాలంలో మిగతా రోజుల్లాగా ఉదయాన్నే లేవడం చాలా కష్టం. ముసుగు తన్ని ఎక్కువసేపు పడుకోవాలనిపిస్తుంది. పొద్దున్నే వ్యాయామం అలవాటు ఉన్న వాళ్లు కూడాఈ రోజుల్లో కాస్త బద్ధకిస్తారు. అందుకే ఈ కాలంలో శరీర కదలికలు సరిగ్గా లేక.. శరీరంలో రక్తప్రసరణ తగ్గుతుంది. కీళ్లు బిగుసుకుపోయి, నొప్పిపెడుతుంటాయి. అందుకే చలికాలంలో కూడా వీలైనంత యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయాలి. శరీరంలో కదలికలు చురుగ్గా ఉంటే శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. ఫలితంగా కుచించుకుపోయిన కీళ్లను యాక్టివ్‌గా మార్చొచ్చు.

వేడిగా ఉంచుకుంటూ..
చలికి విరుగుడు వేడి కాబట్టి, చలితో వచ్చే నొప్పులు తగ్గాలంటే వెచ్చదనం పెంచాలి. అందుకే ఇంట్లో, ఆఫీసులో ఏసీల వాడకాన్ని తగ్గించాలి. శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు హీటర్లు, స్వెటర్లు వాడాలి. గోరువెచ్చని నీళ్లలో ఉప్పు వేసి కాళ్లు, చేతులు ఉంచి కదిలిస్తూ ఉండాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
ఎండ సోకితేనే..
ఏ కాలంలో అయినా శరీరానికి విటమిన్ D ఎంతో ముఖ్యం. అయితే చలికాలంలో వాతావరణంలో ఉన్న మంచు కారణంగా సూర్యకిరణాలు సూటిగా చర్మానికి తగలకపోవచ్చు. అందుకే కనీసం సాయంత్రం సమయంలో అయినా ఎండలో కాసేపు నడవడం ముఖ్యం. అదీ కుదరకపోతే.. కొద్ది మొత్తంలో విటమిన్ D ట్యాబ్లెట్స్ వాడాలి.

వ్యాయామాలూ ముఖ్యమే..
చలికాలంలో కీళ్ల నొప్పులు నుంచి ఉపశమనం పొందాలంటే వ్యాయామం చేయాల్సిందే. చలికాలంలో బద్దకించకుండా.. రోజూ వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు, నడక, పరుగు, మెట్లు ఎక్కడం, సైకిల్ తొక్కడం, క్రాస్ ట్రైనింగ్, స్క్వాట్స్, ప్లాంక్ లాంటి వ్యాయామాలు చేయాలి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇవి కూడా..
చలికాలంలో.. చేతి వేళ్ల నొప్పులు ఉన్నవాళ్లు స్ట్రెస్ బాల్ వ్యాయామం చేయాలి. ఎలాస్టిక్ గ్యాడ్జెట్స్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ వాడాలి.
కీళ్ల నొప్పులు మరీ త్రీవంగా వేధిస్తున్నప్పుడు నువ్వుల నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి కీళ్లపై నెమ్మదిగా మర్దన చేయాలి.
ఈ కాలంలో కీళ్లనొప్పులు ఉన్నవాళ్లు మెత్తని సోఫాలను వాడకపోవడమే మంచిది. సోఫా బదులు, బ్యాక్ సపోర్ట్ ఉన్న చెక్క కుర్చీలు వాడాలి. మెత్తని బూట్లు వాడాలి. నేల, బల్ల మీద పడుకోకూడదు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు బరువును అదుపులో ఉంచుకోవాలి.

కీళ్ల నొప్పులు తగ్గాలన్నా లేదా రాకూడదన్నా.. దానికోసం సరైన డైట్ పాటించాలి. ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి తగినంత కాల్షియం, ఖనిజాలు అవసరం. కీళ్ల సమస్యల నుంచి బయటపడటానికి. పాలు, పెరుగు, బ్రోకొలీ, పచ్చి ఆకుకూరలు, సోయా, బాదం వంటి పోషకాలు కూడా హెల్ప్ చేస్తాయి.